రైతులకు శుభవార్త..మరో వారంలోనే రైతు బంధు నిధులు మంజూరు

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..మరో వారంలోనే రైతు బంధు నిధులు మంజూరు కానున్నాయి. వానకాలం సీజన్ వచ్చేస్తోంది. దీంతో రైతుబంధు నిధుల జమపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఈసారి ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చూస్తోంది. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా రైతులకు ముందుగానే రైతు బంధు నిధులు జమ చేసి తీపి కబురు అందించాలని సర్కార్ భావిస్తోంది.

ఇందులో భాగంగానే… మరో వారం రోజుల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దాదాపు 65 లక్షల మంది రైతులు ఎకరాకు ఐదు వేల చొప్పున ఏకంగా 7400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మొదటి రోజు ఎకరం లోపు రైతులకు… ఆ తర్వాత రోజు ఒక్కో ఎకరా పెంచుకుంటూ జూన్ ఆఖరి వరకు ఖాతాలో డిపాజిట్ చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రైతుబంధు డబ్బులు వర్షాకాలం పంట కోసం వినియోగించుకోవచ్చని పేర్కొంది. రైతు బంధు పథకం కింద ప్రతీ ఎకరానికి వానాకాలం, యాసంగి సీజన్లో రూ.5 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.

త్వరలోనే పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనుంది సర్కార్. వారికి కూడా ఇదే ఏడాది నుంచే రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.