జనంపై అడవి జంతువులు దాడులు.. సీఎం పినరయికి రాహుల్‌గాంధీ లేఖ

rahul-gandhi-writes-to-kerala-cm-pinarayi-vijayan

న్యూఢిల్లీః కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు. కేరళ రాష్ట్రం వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని పయ్యంపల్లిలో అజీష్‌ పినాచియిల్‌ అనే వ్యక్తిని అడవి ఏనుగు దాడి చేసి చంపింది. కొన్ని రోజుల క్రితమే నియోజకవర్గంలో మరో వ్యక్తి కూడా అడవి మృగం దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలను అరికట్టాలని లేఖలో కోరారు.

మృతుడు అజీశ్‌ సంపాదన మీదనే అతని కుంటుంబం ఆధారపడి జీవనం గడుపుతున్నదని, అతనికి అనారోగ్యంతో మంచం పట్టిన తల్లి ఉన్నదని, వారి కుటుంబ పరిస్థితి నా హృదయాన్ని కలచి వేస్తున్నదని రాహుల్‌గాంధీ కేరళ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో తరచూ జనంపై అడవి జంతువులు దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా అడవి మృగాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ఇస్తున్న పరిహారం చాలా తక్కువగా ఉన్నదని, దాన్ని పెంచాలని రాహుల్‌గాంధీ తన లేఖలో డిమాండ్‌ చేశారు.