దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

మెడికల్ విద్యార్థులకు తీపి కబురు తెలిపింది కేంద్రం. దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో తెలంగాణకు 12, ఆంధ్రప్రదేశ్‌కు 5 కొత్త కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలల్లో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా 3 ప్రైవేటువి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి ఆసిఫాబాద్‌, వికారాబాద్‌, భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల, నిర్మల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి.

ఈ వైద్య కళాశాలల్లో ఒక్కో దాంట్లో 100 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున మొత్తం 900 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మొదలవుతాయని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అదేవిధంగా సీఎంఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అరుంధతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఫాదర్‌ కొలంబో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, నీలిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్య కళాశాలకు అనుమతి రాగా ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున 600 సీట్లు మంజూరయ్యాయి