ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమే – సీఎం కేసీఆర్

భారతీయ సామాజిక తత్వవేత్త, మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమేనని తెలంగాణ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జ్యోతిబా ఫూలే దాదాపు రెండు వందలం ఏండ్ల క్రితమే కార్యాచరణ చేపట్టారని సీఎం అన్నారు.

గుణాత్మక మార్పు దిశగా.. దేశంలోని స్త్రీలు, దళిత బహుజనులు ఉద్యమించేలా ఫూలే కార్యాచరణ పురికొల్పిందని సీఎం అన్నారు.మహాత్మా ఫూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చేదిశగా తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణను అమలు చేస్తున్నదని సీఎం అన్నారు.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చైతన్యమూర్తి పూలే అని.. అవిభక్త భారతదేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరుసల్పిన తొలినాటి యోధుడు జ్యోతిరావు పూలే అని తెలిపారు. ఆయన సేవా నిరతి, అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవాజ్యమైన ప్రేమాభిమానాలను మననం చేసుకుంటూ ఆ మార్గదర్శికి ప్రణామాలు అర్పిస్తున్నాను.ఆడబిడ్డలకు చదువు ఎంతో ముఖ్యమని నమ్మి వారి విద్యాభివృద్ధికి అహరహం శ్రమించిన గొప్ప సంస్కర్త అన్నారు.వితంతువుల బిడ్డలు అనాథలు కాకూడదని నమ్మి వారికి అండగా నిలబడిన నిస్వార్ధ సేవకుడని వివరించారు. జన సేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రం.ఆ మహనీయుని అడుగు జాడల్లో జనసేన ప్రస్థానం కొనసాగుతుందన్నారు.