50 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

TSRTC మరో 50 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్‌, ఎండీ వీసీ స‌జ్జనార్ ఈ బస్సులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ చరిత్రలో పెద్ద ఎత్తున బస్సులు కొనుగోలు చేశామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం పాత వాటి స్థానంలో కొత్త బస్సులను కోనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఆర్టీసీ వీటిని కొనుగోలు చేసిందన్నారు.

రూ. 392 కోట్లతో 1,016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డీలక్స్‌, 16 స్లీపర్‌ బస్సులకు ఆర్డర్‌ ఇచ్చారు. వాటిలో 50 బస్సులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన బస్సులు 2023 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన బస్సుల్లో ప్రయాణికుల భద్రతను దృష్ట్యా ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయం ఏర్పాటు చేశారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్‌ బటన్‌ను నొక్కగానే కంట్రోల్‌ రూంకు సమాచారం అందుతుంది. తద్వారా అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకోనున్నారు.