తప్పుని తప్పు అని చెబితే చంపేస్తారా?: లోకేశ్

దళితుడైన వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా: నారా లోకేశ్

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైస్సార్సీపీ శ్రేణులపై మరోమారు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో చంద్రబాబును దూషిస్తున్న వైస్సార్సీపీ శ్రేణులను వెంకటనారాయణ అనే దళితుడు ప్రశ్నించాడని లోకేశ్ తెలిపారు. అయితే, ప్రశ్నించడమే నేరంగా వెంకటనారాయణను వైస్సార్సీపీ కార్యకర్తలు మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆరోపించారు. ఈ రాక్షస మూకల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

“తప్పుని తప్పు అని చెబితే చంపేస్తారా? మంచి చెప్పే మనుషుల ప్రాణాలే తీసేస్తారా?” అంటూ లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఒంగోలులో వైశ్యుడైన వైస్సార్సీపీ నేత సుబ్బారావు గుప్తా, నేడు వెంకటనారాయణ… ఇలా రోజుకొకరు వైస్సార్సీపీ పిశాచ ముఠాలకు బలి కావాల్సిందేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తోందనేది స్పష్టంగా తెలుస్తోందని, అయితే ఆదుకోవాల్సిన పోలీసులు ఏమయ్యారు? అంటూ ఆయన నిలదీశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/