నేడు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం జగన్‌..రేపు ప్రధాని మోడీతో భేటీ!

మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్న ముఖ్యమంత్రి

cm jagan – pm modi

అమరావతిః ఏపి సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సాయంత్రం ఆయన హస్తినకు బయల్దేరుతారు. రేపు ప్రధాని మోడీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలో ఉండనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు కొన్ని అంశాల్లో జగన్ మద్దతును మోడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఉమ్మడి పౌరస్మృతి వంటి వివాదాస్పద బిల్లులు కూడా ఉన్నాయి. ఈ బిల్లులు పాస్ కావాలంటే రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు సహకరించాల్సిందిగా జగన్ ను మోడీ కోరే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీతో ముఖ్యమంత్రి భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.