అసని తుపాను..అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని సూచనలు
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
పునరావాస శిబిరాలను తెరవాలని పేర్కొన్న సీఎం

అమరావతి: అసని తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సహాయక చర్యలపై సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అధికారులకు జగన్ పలు సూచనలు చేశారు. అధికారులు, సిబ్బంది హై అలర్ట్‌గా ఉండాలన్నారు. తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండడం అవసరమని ఆయన అన్నారు.
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే, తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని చెప్పారు. అయినప్పటికీ నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని ఆయన అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను తెరవాలని ఆయన చెప్పారు.
శిబిరాలకు తరలించిన కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేయాలని ఆయన అన్నారు. ఒకవేళ కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్యలు ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కాగా, పలువురు మంత్రులు కూడా అసని తుపాను ప్రభావంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/