ఎమ్మెల్సీ ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందన్న పవన్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేయడం పట్ల జనసేన అధినేత స్పందించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం తో ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి భూమి రెడ్డి రామగోపాలరెడ్డి వైస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7543 ఓట్ల తేడాతో గెలిచారు. ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం సాధించగా, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ గెలిచారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైస్సార్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని పవన్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైస్సార్సీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకులు… పట్టభద్రులు అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. అధికారం తలకెక్కిన నేతలకు పట్టభద్రులు కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే వస్తుందని స్పష్టమైందని పవన్ తెలిపారు.