రెండో రోజు వరద ప్రాంతాల్లో సిఎం జగన్‌ పర్యటన

YouTube video

అమరావతిః వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కోయూగూరు గ్రామంలో పర్యటించిన ఆయన వరద బాధితులతో మాట్లాడారు. సెప్టెంబర్‌లోగా నిర్వాసితులకు పరిహారం అందించిన తరువాతనే ముంపు గ్రామాలను ఖాళీ చేయిస్తామని వెల్లడించారు. గత 20 రోజుల నుంచి వరదలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన ముంపు మండలాలలో కలెక్టర్ , సంబంధిత అధికారులు గ్రామాల్లోనే ఉంటూ బాధితులను అన్ని విధాలా ఆదుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

గతంలో వరదల సమయంలో నాయకులు వచ్చి అధికారులను ఎడాపెడా తిట్టి సస్పెండ్‌ చేసేవారని తాము అలాకాకుండా అధికారులకు అధికారాలు ఇవ్వడం వల్ల సమర్ధవంతంగా పనిచేశారని తెలిపారు. వరదల వల్ల పంట, ఆస్థి నష్టం జరిగిన కుటుంబాలకు రెండు నెలల్లో పరిహారం అందించి ఆదుకుంటామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్ట్‌లో నీళ్లు నింపుతామని భరోసా ఇచ్చారు. కేంద్రం పరిహారం ఇవ్వకుంటే రాష్ట్రం నుంచైనా పరిహారం ఇస్తామని జగన్‌ ప్రకటించారు. ఆరు ముంపు మండలాలకు కలిపి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తామని తెలిపారు.

పోలవరం నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసేందుకు అవసరమైన నిధులకోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని ఏపీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి పోలవరం నిర్వాసితులకు రూ. 20,000 కోట్లు రావాల్సి ఉందని, కేంద్రానికి తామిచ్చిన 2900 ఇవ్వాలని కూడా అనేక రకాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని, వీలైనంత త్వరలో ఒత్తిడి తీసుకొచ్చి ఆదుకుంటామని వివరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/