నేడు ఒడిశాకు వెళ్లనున్న సీఎం జగన్‌

నదీ జలాల వివాదాలపై చర్చ

అమరావతి : నేడు ఒడిశా పర్యటనకు సీఎం జగన్ వెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం భువనేశ్వర్‌లో నవీన్‌ పట్నాయక్‌తో సీఎం జగన్ సమావేశమవుతున్నారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టులకు భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుకు సహకరించాల్సిందిగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కోరనున్నారు. నేరడి బ్యారేజీ, జంఝావతితో పాటు, కొఠియా గ్రామాల సమస్యపై చర్చించనున్నారు.

ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల, సరిహద్దు వివాదాలకు పరిష్కారం వెదికే సీఎం జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సరిహద్దు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరిస్తూ సమస్యలు పరిష్కరించుకుని కలిసి అభివృద్ధి చెందడమే తమ అభిమతమని సీఎం జగన్‌ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో చర్చలకు సమయమిస్తే తానే వస్తానంటూ ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు లేఖ రాసి చొరవ చూపారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించారు. ఇద్దరు సీఎంల సమావేశంతో సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ముందడుగు పడుతోంది. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతిపై కాంక్రీట్‌ డ్యామ్, కొఠియా గ్రామాల అంశాలు ఇరువురి సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. పోలవరం కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనిపై సలహాపూర్వక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/