పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టిన న్యూజిలాండ్ వాసులు

కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలు

వెల్లింగ్టన్: కరోనా లాక్‌డౌన్, తప్పనిసరి వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా న్యూజిలాండ్‌లో వేలాదిమంది ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పార్లమెంటు భవనం ‘బీహైవ్’ను చుట్టుముట్టారు. దీంతో పార్లమెంటు రెండు ప్రవేశ ద్వారాలు మినహా మిగిలిన అన్నింటినీ మూసివేసిన భద్రతా దళాలు, పోలీసులు భవనం ఎదుట పెద్ద ఎత్తున మోహరించారు. నిరసనకారుల్లో అత్యధికులు ఎలాంటి ముసుగులు లేకుండానే ఆందోళనకు దిగారు. పార్లమెంటు భవనం బయట నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన తెలిపినప్పటికీ శాంతియుతంగా జరగడం గమనార్హం.

‘స్వేచ్ఛ కావాలి’, ‘మేం ప్రయోగశాలల్లోని ఎలుకలం కాదు’ అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలన్న నిబంధనతోపాటు కరోనా నేపథ్యంలో విధించిన అన్ని ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘వ్యాక్సిన్ తీసుకోమని నన్నెలా బలవంతం చేస్తారు? నా శరీరం కోరుకోని దానిని తీసుకోమని ఎలా చెబుతారు?’’ అని ఓ నిరసనకారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నిరసనకారుడు మాట్లాడుతూ… ‘‘మాకు 2018 నాటి స్వేచ్ఛ కావాలి. ప్రభుత్వం అది తెచ్చిస్తే చాలు’’ అని డిమాండ్ చేశారు.

గతేడాది కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన న్యూజిలాండ్ ఈసారి మాత్రం డెల్టా వేరియంట్ దెబ్బకు వణుకుతోంది. దీంతో లాక్‌డౌన్‌ల ద్వారా మహమ్మారిని నిర్మూలించాలని భావించిన ప్రధాని జసిండా ఆర్డెర్న్ కఠిన ఆంక్షలు విధించడంతోపాటు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని ఆదేశించారు.

ప్రధాని గత నెలలో మాట్లాడుతూ.. టీచర్లు, ఆరోగ్య, వైకల్య రంగాల్లో పనిచేస్తున్న వారు పూర్తిస్థాయిలో టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అర్హులైన 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ఆంక్షలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే, స్వేచ్ఛను కోరుకునే ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తక్షణం ఆంక్షలను ఎత్తివేయడంతోపాటు తప్పనిసరిగా టీకా తీసుకోవాలన్న నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే తాజాగా పార్లమెంటును ముట్టడించారు.

అయితే, అతి తక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. ఇక్కడ ఇప్పటి వరకు 8 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. అలాగే, 32 మంది మరణించారు. కాగా, మంగళవారం దేశంలో 125 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో రెండు డోసులూ తీసుకున్న వారి సంఖ్య 80 శాతానికి చేరుకుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/