పార్ల‌మెంట్ శీతాకాల సమావేశాలకు తేదీ ఫిక్స్

పార్ల‌మెంట్ శీతాకాల సమావేశాలకు తేదీ ఫిక్స్ చేసారు. న‌వంబ‌ర్ 29 నుంచి డిసెంబ‌ర్ 23 వ‌ర‌కూ
సమావేశాలను నిర్వ‌హించాల‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ సిఫార్సు చేసింది. ఉభ‌య‌స‌భ‌లూ దాదాపు 20 సెష‌న్స్ భేటీ అవ‌నుండ‌గా క్రిస్మ‌స్‌కు ముందు స‌మావేశాలు ముగియనున్నాయి. యూపీ, పంజాబ్ స‌హా కీల‌క అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశల నిర్వహణకు సంబంధించి రాజ్ నాథ్ నేతృత్వంలోని సీసీపీఏ అక్టోబర్ చివరివారంలో సమావేశమైంది. కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వివిధ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ తేదీలైతే వీలుగా ఉంటుందని కమిటీ ఒక నిర్ధారణకు వచ్చింది. మొత్తం 19 రోజుల పాటు ఏకకాలంలో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. కొవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ప్రస్తుతం దేశంలో పెట్రో, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుండటం, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం ఏడాది దాటడం, లఖీంపూర్ లో రైతులపై హింసాకాండ, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఆక్రమణలు తదితర సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వీటిపై సర్కారును నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి.