రైతుల్లో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్‌

అమరావతి: సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులు ఆదాయం వచ్చే పంటలు పండించడం అలవాటు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వరికి బదులు మిల్లెట్స్ పండించడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చునని రైతులకు సలహా ఇచ్చారు. మిల్లెట్స్‌ పండించే వారి కోసం మిల్లెట్స్‌ బోర్డు ఏర్పాటుచేస్తామని, మిల్లెట్లు ఎక్కువగా పండించే ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని, ఇతర పంటలు సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలని అధికారులను ఆదేశించారు. సేంద్రీయ, ప్రకృతిసేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలని చెప్పారు.

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందించాన్ని ఉద్దేశంతో ఆర్బీకేలను ఏర్పాటు చేశామని, వాటిని నీరుగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో ప్రమేయం ఉండే ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలకు పాల్పడే వ్యాపారులపైనా కఠిన చర్యలు తప్పవన్నారు. దీని కోసం అవసరమైతే చట్టంలో మార్పులు చేసి ఆర్డినెన్స్‌ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమావేశంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై కూడా జగన్‌ సమీక్షించారు. డిసెంబర్‌ నెలలో కృష్ణ, అనంతపురం జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించి దీని ద్వారా 1.77 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చుతున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/