నేడే విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్

దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్టు 6వ తేదీన జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ పర్వం కొనసాగుతుంది. నిన్న అధికార ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధనకర్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా..ఈరోజు విపక్షాల తరఫున రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.

1942లో మంగళూరులోని రోమన్‌ కాథలిక్‌ కుటుంబంలో మార్గరెట్ ఆల్వా జన్మించారు. గతంలో గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలు ప్రధానులుగా ఉన్న సమయంలో.. మార్గరెట్‌ కేంద్రమంత్రిగా సేవలందించారు. మార్గరెట్‌ 1974-98 వరకు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు.

సోమవారం దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా..పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటు వేశారు. 4,796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 99శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 11 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎమ్మెల్యేలందరూ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఛత్తీస్ ఘడ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, తమిళనాడు, పాండిచ్చేరిల్లో 100శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారు తెలిపారు.