ఓటీఎస్‌ విషయంలో పేదలను ఎవరూ బలవంతం పెట్టడం లేదు: సజ్జల

అమరావతి: పేదలకు శాశ్వత గృహ హక్కు కల్పిస్తుంటే.. టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని వైస్సార్సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ సజ్జల మండిపడ్డారు. ఓటీఎస్‌ విషయంలో పేదలను ఎవరూ బలవంతం పెట్టడం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని.. ఆయన విమర్శలు అర్థరహితమంటూ సజ్జల తెలిపారు. 30 లక్షల మందికి సీఎం జగన్ ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కట్టించి ఇస్తోందని సజ్జల పేర్కొన్నారు. ఉన్న రుణాలు పూర్తిగా మాఫీ చేసి మరి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని సజ్జల స్పష్టంచేశారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా కనీసం వడ్డీ కూడా మాఫీకి ఒప్పుకోలేదన్నారు. రుణం ఉన్నవారే రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రుణం లేకుంటే 10 రూపాయలతోనే రిజిస్ట్రేషన్ చేస్తారని సజ్జల స్పష్టంచేశారు. ఈ పథకంలో బలవంతం ఏమి లేదు.. ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందంటూ పేర్కొన్నారు. కావాల్సిన వాళ్ళు చేయించుకోవచ్చు.. వద్దు అనుకునే వాళ్ళు అలానే ఉంచుకోవచ్చన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం వాళ్లపై ప్రేమే ఉంటుందని.. చెయ్యాల్సిన మంచి చేస్తామంటూ సజ్జల స్పష్టంచేశారు. ప్రభుత్వం రాగానే ఉద్యోగులు అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చామన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/