సహకార వ్యవస్థను బలోపేతం చేసింది వైఎస్‌ఆర్‌: సిఎం జగన్

ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్

CM Jagan participates in diamond jubilee celebrations of APCOB, unveils new logo

విజయవాడః సిఎం జగన్‌ విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగోను, పోస్టల్ స్టాంపును ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… సహకార వ్యవస్థను బలోపేతం చేసింది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఆప్కాబ్ తోనే రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గరయిందని… రైతులకు ఆప్కాబ్ ఇస్తున్న చేయూత చాలా గొప్పదని కితాబిచ్చారు. సహకార బ్యాంకులు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయని ప్రశంసించారు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోందని చెప్పారు.

ఆర్బీకేలను ఆప్కాబ్ తో అనుసంధానం చేశామని… ఇప్పుడు ఆర్బీకేల స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని జగన్ అన్నారు. ఆర్బీకేలు రైతుల చేతులు పట్టుకుని నడిపిస్తున్నాయని చెప్పారు. దేశ చరిత్రలోనే మన ఆప్కాబ్ కు మంచి గుర్తింపు ఉందని అన్నారు. ఆప్కాబ్ సేవలు మరింతగా విస్తరిస్తున్నాయని.. రోబోయే రోజుల్లో మరిన్ని మార్పులను చూస్తామని చెప్పారు. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే బతుకుతాడు, అప్పుల్లోనే చనిపోతాడు అని ఒక నానుడి ఉండేదన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గర అడుగులు వేయటంతో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని సిఎం జగన్‌ చెప్పారు.