ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

cm-jagan-letter-to-pm-modi-on-the-issue-of-krishna-water

అమరావతిః కృష్ణా జలాలపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల మధ్య మధ్య పంపిణీ చేయడం కోసం బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు తాజా విధివిధానాలను ప్రతిపాదించాలని నిర్ణయించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తాజా విధివిధానాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలను మినహాయించి కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకే పరిమితం చేయడం భావ్యం కాదన్నారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ –2కు మరిన్ని విధి విధా­నాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని దీనిపై తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 ఎస్‌ఎల్‌పీలు దాఖలయ్యాయని తెలిపారు. సెక్షన్‌ 5(2)ప్రకారం ఆ ట్రైబ్యునల్‌ నివేదికను పక్కనపెట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని ఎస్‌ఎల్‌పీలూ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని… ఈ సమస్య గురించి 2021 ఆగస్టు 17, 2022 జూన్‌ 25న కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకొచ్చామన్నారు. 2014 జులై 14న తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ విధివిధానాలను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం కృష్ణా నది ప్రవాహాలపై ఆధారపడిన ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కల్గించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.