గ‌గ‌న్‌యాన్ క్రూ మాడ్యూల్‌ను పరీక్షించనున్న ఇస్రో

ఫ్లైట్ టెస్ట్ అబార్ట్ మిషన్ పేరిట త్వరలో ఇస్రో కీలక పరీక్ష

ISRO offers sneak peek at first crew module for Gaganyaan test flight

బెంగళూరుః మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర సందర్భాల్లో వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ వ్యవస్థను త్వరలో పరీక్షించనుంది. ఫ్లైట్ టెస్ట్ అబార్ట్ మిషన్ పేరిట ఇస్రో ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందుకోసం ఓ ప్రయోగాత్మక క్రూ మాడ్యుల్‌‌తో పాటూ క్రూ ఎస్కేప్ వ్యవస్థను రూపొందించింది. పరీక్ష సందర్భంగా రాకెట్ సాయంతో మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపిస్తారు. అనంతరం, క్రూ ఎస్కేప్ వ్యవస్థను పరీక్షిస్తారు.

ఈ క్రమంలో రాకెట్ నుంచి విడివడే క్రూ మాడ్యుల్ పారాషూట్ల సాయంతో బంగాళాఖాతంలో దిగుతుంది. ఈ సందర్భంగా వ్యోమగాముల రక్షణకు ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును మాడ్యూల్‌లోని వివిధ పరికరాలతో శాస్త్రవేత్తలు సేకరిస్తారు. క్రూ మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకున్నాక అందులోని డాటా ఆధారంగా మరిన్ని మెరుగులు దిద్దుతారు. త్వరలో ఫ్లైట్ టెస్ట్ అబార్ట్ మిషన్ చేపడతామని ఇస్రో తాజాగా వెల్లడించింది.