63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం జ‌గ‌న్‌ గ్రీన్‌ సిగ్నల్

ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు.. పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. 63 సీడీపీఓ (CDPO) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్షా జరిపారు. ఈ స‌మావేశానికి మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎస్‌ డాక్టర్ కే. ఎస్‌. జవహర్‌ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎ. బాబు, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ ఎండీ జీ. వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్ ఏ. సిరి, మార్క్‌ ఫెడ్‌ ఎండీ రాహుల్‌ పాండే, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చిన్నారులకు మంచి వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ‘అంగ‌న్ వాడీల్లో నాడు-నేడు కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చుచేస్తోంది. మూడు విడతల్లో ప‌నులు చేప‌ట్టాలి. మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలి. పనుల్లో నాణ్యత ఉండాలి, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలి. ప్రతి మండలంలోనూ పనులు జరిగేలా కార్యాచరణ రూపొందించాలి. అంగన్‌వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. సమగ్రమైన ఎస్‌ఓపీలు రూపొందించుకోవాలి. టెక్నాలజీ వాడుకోవాలి’ అని సీఎం జగన్ ఆదేశించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీచేయాలని ఆదేశించారు.