గత మూడేళ్లలో అభివృద్ధి దిశగా అనేక అడుగుల పడ్డాయిః సిఎం జగన్‌

పారిశ్రామికాభివృద్ధిపై చర్చ..సీఎం జగన్ ప్రసంగం

cm-jagan-explains-ap-govt-industrial-development-in-three-years

అమరావతిః ఏపి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గత మూడేళ్లలో అభివృద్ధి దిశగా అనేక అడుగుల పడ్డాయని, ప్రభుత్వ చర్యలతో పారిశ్రామిక రంగం నిలదొక్కుకుందని వెల్లడించారు. మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలో రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించాయని సీఎం జగన్ తెలిపారు. భారీ పరిశ్రమలతో రూ.46,280 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా 62,541 మందికి ఉపాధి కలుగుతోందని అన్నారు. మరో 40 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మరో నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, ఎంఎస్ఎంఈ రంగానికి ఇప్పటివరకు రూ.2,500 కోట్ల ప్రోత్సాహకాలు అందజేశామని చెప్పారు. ఈ రంగంలో 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. లక్షల మందికి ఉపాధినిచ్చే ఎంఎస్ఎంఈ రంగాన్ని చంద్రబాబు నాశనం చేశారని, కానీ తమ చర్యలతో ఎంఎస్ఎంఈ రంగం మళ్లీ పుంజుకుందని అన్నారు.

రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మరో 30 వేలు ఉద్యోగాలు వస్తాయని, అయితే, బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని సీఎం జగన్ ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏపీకి ఇస్తామని కేంద్రం చెప్పిందని, కానీ ఆ పార్క్ వద్దంటూ టిడిపి కేంద్రానికి లేఖ రాసిందని వెల్లడించారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని, గతంలో దివీస్ ఫార్మా వచ్చినప్పుడు చంద్రబాబుకు పొల్యూషన్ గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రగతి చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా ఉందని, గతంలో కంటే రాష్ట్రానికి అధికమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో సగటున రూ.11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, ఈ మూడేళ్ల వ్యవధిలోనే తాము సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. వరుసగా మూడో ఏడాది కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందని వెల్లడించారు. ప్రభుత్వ విధానాల పట్ల పారిశ్రామికవేత్తలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు.

చంద్రబాబులా తాము అబద్ధాలు ప్రచారం చేయడంలేదని, పారిశ్రామికవేత్తల్లో తమ ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని తెలిపారు. బిర్లా, సన్ ఫార్మా, ఆదిత్య మిట్టల్, అదానీ, సెంచురీ ప్లైవుడ్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీకి వస్తున్నాయని అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయని చెప్పారు. గతంలో దేనికైనా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పారదర్శకత తీసుకువచ్చామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం సమయంలోనూ ఏపీ ప్రభుత్వం నిలదొక్కుకుందని, 11.43 శాతం వృద్ధి రేటుతో మిగలా రాష్ట్రాల కంటే మిన్నగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 3.97 లక్షల ఉద్యోగాలు వస్తే, తాము ఈ మూడేళ్లలోనే 2.06 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సగర్వంగా తెలిపారు. చంద్రబాబు హయాంలో 34 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని అన్నారు. తాము ఔట్ సోర్సింగ్ విధానంలో 3.71 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం జగన్ వివరించారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో 1.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఓవరాల్ గా 6.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. ఆర్టీసీని విలీనం చేసి 51,387 ఉద్యోగాలు ఇచ్చామని, వైద్య రంగంలో 16,880 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 2.60 లక్షల మంది వాలంటీర్లుగా అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/