బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే ఆయన పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ను కాషాయ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజీజు బీజేపీ కండువా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. మరో కేంద్రమంత్రి నరేంద్ర తోమర్‌ సభ్యత్వాన్ని అందజేశారు. అంతకు ముందు అమరీందర్‌.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరణ్ రిజిజు, పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వని శర్మ తదిరులు అమరీందర్ సింగ్ కు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించిన అమరీందర్ సింగ్… అనూహ్యరీతిలో సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానం తన పట్ల వ్యవహరించి తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమరీందర్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, గతేడాది పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పార్టీని ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. అమరీందర్‌ కాంగ్రెస్‌ నుంచి రెండుసార్లు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరడంతో ఆయన పాత్రేంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. 75 సంవత్సరాలు పైబడిన నేతలకు బీజేపీ టికెట్లు ఇవ్వని విషయం తెలిసిందే.