ఉచిత కరెంట్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కోమటిరెడ్డి

తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని, ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్‌ ఎందుకు అన్నట్లుగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇప్పటీకే రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఘాటుగా స్పందిస్తూ..కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది.

అలాగే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రేవంత్ ఉచిత కరెంట్ వద్దు అంటే అది తప్పేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతమైనవని అన్నారు. ఆయన చెప్తే ఫైనల్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుందని వెంకట్ రెడ్డి చెప్పారు. స్టార్ క్యాంపెనర్‌గా తాను చెప్తున్నా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

తాను రేవంత్ రెడ్డి కేవలం పార్టీకి కోఆర్డినేటర్స్ మాత్రమేనని చెప్పిన ఆయన సీఎం ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని.. మేనిఫెస్టో లో కూడా పెడతామని వెంకట్ రెడ్డి చెప్పారు. రేవంత్ అప్పట్లో కాంగ్రెస్ లో లేరు కాబట్టి ఉచిత విద్యుత్ కోసం ఎంత కష్టపడ్డామో ఆయనకు తెలియదన్నారు. రేవంత్ , కోమటిరెడ్డి లకు మేము ఏం చేస్తాం అనే హక్కు తమకు ఉండదన్నారు.