చెప్పులు చూపిస్తూ దారుణమైన భాష మాట్లడే నాయకులు మనకు అవసరమా? : సీఎం జగన్

అవనిగడ్డలో రైతులకు భూమి పట్టాలు పంచిన జగన్
పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్

cm-jagan-comments-on-pawan-kalyan

అమరావతి: సీఎం జగన్ అవనిగడ్డలో రైతులకు భూమి పట్టాలు పంచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. చుక్కల, అనాధీన, నిషేధిత జాబితా 22(1)లోని భూములను డీనోటిఫై చేశామని, ఇకపై ఆ భూములపై యజమానులకు సర్వహక్కులు ఉంటాయని జగన్ తెలిపారు. తమ భూములు అమ్ముకోవచ్చు, బిడ్డల పేరుమీదికి మార్చుకోవచ్చని వివరించారు. గత ప్రభుత్వం 2016 మే నెలలో ఈ భూములను నిషేధిత జాబితాలోకి చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని సీఎం విమర్శించారు. రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి వాటికి క్లియరెన్స్ ఇస్తున్నామని జగన్ చెప్పారు.

రైతుల కష్టాలను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు మహానేత వైఎస్సార్ ప్రభుత్వం.. తర్వాత మళ్లీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వమేనని వివరించారు. రాష్ట్రంలో భూసర్వే పేరుతో పెద్ద యజ్ఞం జరుగుతోందని సీఎం చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో భూములకు కచ్చితమైన రికార్డులు లేవని సీఎం చెప్పారు. ఉన్న రికార్డులలోనూ కచ్చితమైన వివరాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదని వివరించారు. ఈ పరిస్థితుల్లో దాదాపు 22 వేల రైతులకు ప్రయోజనం కలిగేలా ఆధునిక టెక్నాలజీ సాయంతో భూముల సర్వే చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 15 వేల మందికి పైగా సర్వేయర్లను మీ అన్న జగనన్న సర్కారు నియమించిందని తెలిపారు. నవంబర్ చివరిలోగా 1500 గ్రామాల్లో భూసర్వే పూర్తిచేసి హద్దులు నిర్ణయిస్తామని సీఎం చెప్పారు. వచ్చే ఏడాదికల్లా 17 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని వెల్లడించారు.

రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ, ఎవరికీ అన్యాయం జరగకుండా అభివృద్ధి చేసుకుందామని మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే, కొంతమంది నేతలు మూడు రాజధానులతో కాదు మూడు పెళ్లిళ్లతో అభివృద్ధి జరుగుతుందని కొంతమంది చెబుతున్నారని పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఏకంగా టీవీల ముందుకొచ్చి మరీ మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెప్తున్నారు, చెప్పులు చూపిస్తూ దారుణమైన భాష మాట్లడే నాయకులు మనకు అవసరమా? అని విమర్శించారు. ఇలాంటి వాళ్లా మన నాయకులని విరక్తి కలుగుతున్నట్లు జగన్ చెప్పారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లాడరని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కరూ మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే మన అక్కాచెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి, ఎంతోకొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవల మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై స్పందించిన విషయం తెలిసిందే. తనను పదేపదే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.. మీరు కూడా చేసుకోండని పవన్ సూచించారు. మొదటి భార్యకు 
ఐదు కోట్లు ఇచ్చి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకొమ్మని అన్నారు. విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నాను తప్ప కొంతమంది నేతల లాగా ఒక్క పెళ్లి చేసుకుని, ముప్పై మంది స్టెఫినీలతో తిరగలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.