లడ్డు విషయంలో శ్రీవారి భక్తులకు షాక్‌ ఇచ్చిన టీటీడీ..

తిరుమల శ్రీవారి భక్తులకు అందించే లడ్డు విషయంలో టీటీడీ షాక్ ఇచ్చింది. భక్తులకు ఇచ్చే లడ్డూలపై టీటీడీ పరిమితులు విధించింది. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు (Geographical Patent) లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం.

భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసేరోజుల్లో 19వ శతాబ్ది మధ్యభాగంలో తీపిబూందీ ప్రవేశపెట్టారు.

1940ల నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు సంపాదించుకుంది, ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది.ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. అందుకే ఇప్పటికే తిరుపతి లడ్డు అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాంటి లడ్డు ఫై టీటీడీ పరిమితులు విధించింది. ఇప్పటి వరకు భక్తులు ఎన్ని లడ్డూలు అయినా కొనుక్కునే వీలుండగా, ఇప్పుడు రెండు మాత్రమే ఇస్తున్నట్టు భక్తులు చెబుతున్నారు. ఓ ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు లడ్డూలు మాత్రమే విక్రయించిన విషయం వాస్తవమేనని లడ్డూ ప్రసాద విక్రయం కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం భక్తుల సంఖ్య రోజుకు 90వేలు దాటుతుండగా, లడ్డూలు మాత్రం 3 లక్షలు మాత్రమే తయారుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.