మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్లకు మరో అరుదైన గౌరవం

పద్మభూషణ్ అందుకున్న సత్యనాదెళ్ల

satya-nadella
satya-nadella

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్లకు మరో అరుదైన గౌరవం దక్కింది. గతవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా సత్యనాదెళ్ల పద్మభూషన్ అవార్డును అందుకున్నారు. అంతకుముందు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అవార్డును అందుకునేందుకు సత్యనాదెళ్ల భారత్ కు రాలేకపోయారు. భారత్ కు రాలేకపోవడంతో శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు అందుకోవడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. సాంకేతికతను మరింత పెంచే విధంగా దేశం అంతా తిరిగి… ప్రజలతో కలిసి పని చేయడం కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన 17 మంది అవార్డు గ్రహీతల్లో సత్యనాదెళ్ల ఒకరిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సత్యనాదెళ్ల వయసు 55 సంవత్సరాలు.

కాగా, పద్మభూషణ్ అవార్డును అందుకున్నందుకు.. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు దేశ ప్రజలకు సత్యనాదెళ్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దేశంలో సమ్మిళిత వృద్ధికి సాధికారత కల్పించడంలో డిజిటల్ టెక్నాలజీ పోషిస్తున్న కీలక పాత్ర పై ప్రసాద్ తో చర్చించారు. రాబోయే దశాబ్ధంలో డిజిటల్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని నాదెళ్ల చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. ఇది చివరికి గొప్ప ఆవిష్కరణకు దారి తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే భారతదేశ అత్యున్నత పురస్కారాలలో పద్మ అవార్డులు ఒకటి.