చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందిః సిఎం జగన్

గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం విడుదల

cm-jagan-comments-on-chandrababu-in-kalyandurg-meeting

అమరావతిః చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. గతంలో కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ రోజు వైఎస్‌ఆర్‌ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం 2022–ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని చెప్పారు. బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.

‘‘ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు. మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టాం” అని చెప్పారు. ఐదేళ్లలో చంద్రబాబు.. రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారని విమర్శించారు.

‘‘మనకు పాడి పంటలు ఉండే పాలన కావాలా.. నక్కలు, తోడేళ్లు ఉండే పాలన కావాలా? రైతు రాజ్యం కావాలా.. రైతులను మోసం చేసే పాలన కావాలా? రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా.. దళారీ వ్యవస్థ కావాలా? పేదల ప్రభుత్వం కావాలా.. పెత్తందారుల ప్రభుత్వం కావాలా? ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి” అని జగన్ అన్నారు.

‘‘గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు? చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నైతికత లేని వ్యక్తిని చంద్రబాబు అంటారు. వీళ్లలా నాకు అబద్ధాలు చెప్పడం రాదు’’ అని చెప్పారు.