వైఎస్‌ఆర్‌ను స్మరించుకున్నందుకు ధన్యవాదాలుః వైఎస్ షర్మిల

వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ

ys-sharmila-thanked-rahul-gandhi

హైదరాబాద్‌ః నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. వైఎస్‌ఆర్‌ దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు అని కీర్తించారు. వైఎస్‌ఆర్‌ చిరస్మరణీయ నేత అని అభివర్ణించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

దీనిపై వైఎస్‌ఆర్‌ తనయ షర్మిల స్పందించారు. వైఎస్‌ఆర్‌ పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో స్పందించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నందుకు ధన్యవాదాలు అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ప్రజాసేవ కోసం నిబద్ధతతో పనిచేసిన కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్‌ఆర్‌ అని పేర్కొన్నారు. చివరి క్షణం వరకు ప్రజాసేవలోనే గడిపారని అన్నారు.

ముఖ్యంగా మీ (రాహుల్) నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నమ్మారని వివరించారు. నాడు వైఎస్ అమలు చేసిన పథకాలే ఈ రోజుకూ కూడా దేశవ్యాప్తంగా సంక్షేమ పాలనకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని షర్మిల గర్వంగా తెలిపారు. డాక్టర్ వైఎస్‌ఆర్‌ ను ఇంకా మీ గుండెల్లో నిలుపుకున్నందుకు థాంక్యూ సర్ అంటూ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.