నాడు-నేడుపై అధికారులతో సిఎం జగన్‌ సమీక్ష

నాడు-నేడు కార్యక్రమం రెండో విడతకు సిద్ధమవ్వండి..సిఎం

అమరావతి: సిఎం జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో ‘నాడు-నేడు’ కార్యక్రమంతోపాటు ‘గోరుముద్ద’పై‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి ‘నాడు నేడు’ కార్యక్రమం రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశించారు. నేడు మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా రెండో విడత ప్రారంభించాలని సిఎం జగన్‌ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. రెండో విడత పనులను ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకున్నట్లు వివరించారు. రెండో విడత కోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదటి విడత కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నదని, పాఠశాలను బాగుకు ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు పేర్కొన్నారు.


పాఠశాల పునఃప్రారంభం, విద్యార్థుల హాజరుపై అధికారుల నుంచి సిఎం జగన్‌ వివరాలు కోరారు. పిల్లల హాజరుపై యాప్‌ను రూపొందించారా? లేదా? అని ప్రశ్నించగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి విద్యార్థుల హాజరుపై యాప్‌ ద్వారా వివరాలు సేకరిస్తామని అధికారులు బదులిచ్చారు. విద్యార్థులు గైర్హాజరయితే వారి తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలని, రెండో రోజు నేరుగా వలంటీర్‌ను పంపి వివరాలు తెలుసుకోవాలని సిఎం సూచించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/