ఖమ్మం తర్వాత విశాఖ లో బిఆర్ఎస్ భారీ సభ

BRS to hold massive public meeting in Vizag soon

తెలంగాణ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ని ప్రకటించిన తర్వాత నేడు ఖమ్మంలో తొలి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు బిఆర్ఎస్ నేతలు , కార్య కర్తలే కాకుండా కేరళ సీఎం పినరాయి విజయన్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ లతో పాటు సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా పాల్గొంటున్నారు. అలాగే ఏపీ నుండి కూడా పలువురు బిఆర్ఎస్ నేతలు , కార్య కర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకాబోతున్నారు. ఇప్పటికే సభ స్థలం కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది.

ఇక ఇదిలా ఉంటె ఖమ్మం సభ తర్వాత నెక్స్ట్ ఏపీలోనే బిఆర్ఎస్ భారీ సభ ఉండబోతుందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వైజాగ్ లో భారీ సభ నిర్వహించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సభకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే బహిరంగ సభ లేదీని ప్రకటిస్తామని తెలిపారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషింబోతోందని, ఏపీలో కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడతామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బరిలోకి దిగుతామని తోట చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనపై చేసి ఆరోపణలపై చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, చిల్లర రాజకీయాల కోసమే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఖమ్మం బహిరంగ సభ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రఘునందన్ రావు ఆరోపణలు నిజమైతే ఆయన చెప్పిన సర్వే నెంబర్‌లో ఉన్న భూమిని 90 శాతం ఆయనే తీసుకుని 10 శాతం తనకు ఇవ్వాలని చంద్రశేఖర్ అన్నారు.