జనసేన పార్టీలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే

Chittoor MLA Arani Srinivasulu joins jaNasena party

అమరావతిః చిత్తూరు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేడు జనసేన పార్టీలో చేరారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆరణి శ్రీనివాసులుకు పవన్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌సిపిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. బలిజ సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని తానేనని వెల్లడించారు. అలాంటిది తనకు కూడా టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

సిద్ధాంతాలు నచ్చే జనసేన పార్టీలోకి వచ్చానని స్పష్టం చేశారు. చిత్తూరులో జనసేన అభిమానుల ఇళ్లను కూల్చివేస్తున్నారని, తిరుపతిలో పేదల ఇళ్లను వైఎస్‌ఆర్‌సిపి నేతలు తొలగించారని ఆరోపించారు.