బీజేపీలో చేరిన మాజీ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి

Ex-Calcutta HC judge Abhijit Gangopadhyay joins BJP

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కీలక తీర్పులు వెలువరించి ‘ప్రజల న్యాయమూర్తి’గా పేరు పొందిన కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ తన పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా బిజెపి లో చేరారు.

గురువారం ఉదయం కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ ప్రాంతంలోగల బిజెపి ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ బిజెపి కండువా కప్పి అభిజిత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం అభిజిత్‌ మీడియాతో మాట్లాడారు. కొత్త రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. బిజెపిలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో ఓ సైనికుడిగా పనిచేస్తా అన్నారు. అవినీతి టీఎంసీ పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే తమ ప్రధాన లక్ష్యం అని ఈ సందర్భంగా అభిజిత్‌ వ్యాఖ్యానించారు.

కాగా, గంగోపాధ్యాయ్‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లోని తామ్‌లుక్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న బిజెపి టికెట్‌పై పోటీ చేస్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తామ్‌లుక్ స్థానంలో సాధార‌ణ‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంటుంది. 2009 నుంచి 2016 వ‌ర‌కు ఆ స్థానం నుంచి సువేంధు అధికారి గెలిచారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న్ను సీఎం మ‌మ‌తాకు రైట్‌హ్యాండ్‌గా భావించారు.