పెను ప్రమాదం నుండి బయటపడ్డ నిమ్మకాయల చినరాజప్ప

పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. దర్గా సెంటర్ వద్ద ఓ వ్యక్తి అకస్మాత్తుగా అడ్డురావడంతో డ్రైవర్ అతడ్ని తప్పించే క్రమంలో డివైడర్ పైకి ఎక్కించాడు. దీంతో కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారులోనే ఉన్న చినరాజప్ప క్షేమంగా బయటపడ్డారు.

శనివారం రాత్రి గుంటూరు నుంచి పెద్దాపురంలోని తన స్వగ్రామానికి వచ్చిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్పను ప్రకటించిన విషయం తెలిసిందే. చినరాజప్పకు మూడో సారి టికెట్ దక్కడంతో ఆయన అనుచరులు, పార్టీశ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని టీడీపీ కార్యాలయం నుంచి పెద్దాపురం వచ్చిన ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికాయి. ఈ సమయంలో పాశీలవారివీధిలో చినరాజప్పను సన్మానించాలని కార్యకర్తలు ముందుకొచ్చారు. వారిని డ్రైవర్‌ తప్పించే క్రమంలో వాహనం డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులోనే ఉన్న చినరాజప్పతో పాటు కొందరు నాయకులు అప్రమత్తమై కిందకు దిగేశారు. దీంతో వారంతంగా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో చినరాజప్ప సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.