సిరిసిల్ల జిల్లాలో నూతన వ్యవసాయ కళాశాల ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల సమీపంలో.. అధునాతన సౌకర్యాలు.. ఆహ్లాదభరిత వాతావరణంలో నిర్మించిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భవన సముదాయాలను పరిశీలించారు. మంత్రుల వెంట అతిథులుగా శాసనసభా సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి హాజరయ్యారు.

2018 ఆగస్టు 9న తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల భవనాల సముదాయానికి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే ఏడాది పీజీటీఎస్‌ఏసీ ఆధ్వర్యంలో ఎంసెట్‌ ద్వారా విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభం కాగా, సర్దాపూర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిల్‌ కళాశాలలో తరగతులను ప్రారంభించారు.
తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల శివారులో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 69.50 కోట్లతో సకల వసతులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కనే అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థుల సౌకర్యార్థం 16 ఎకరాల్లో జీ ప్లస్‌ 2 పద్ధతిలో కళాశాల భవనం, విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు, 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం, ఫామ్ లాండ్స్‌ను నిర్మించారు. ఆధునిక టెక్నాలజీతో నూతన ప్రాంగణాన్ని అందుబాటులోకి తెచ్చారు.