‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణానికి రూ.979 కోట్లు ఖర్చయ్యాయి. ఈ వంతెన ఓఖా ప్రాంతంతో ద్వారక ద్వీపాన్ని అనుసంధానం చేస్తుంది. త్వరలోనే ఈ బ్రిడ్జిపై పూర్తి స్థాయిలో రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వంతెనకు ఇరువైపులా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించబడిన నడక మార్గం ఉంది. ఈ వంతెనను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరవాత గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొలి AIIMS హాస్పిటల్‌ని ప్రారంభిస్తారు. కేబుల్ బ్రిడ్జ్‌ని ప్రారంభించడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని వెల్లడించారు.