శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు

ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లో కంపించిన భూమి

శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లో గత రాత్రి భూకంపం సంభవించింది. పది నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు బీటలు వారాయి. ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా పడిపోయింది. ప్రకంపనలు ఆగిపోయాయని భావిస్తున్న వేళ అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మరోమారు భూమి కంపించింది. దీంతో జనం రాత్రంతా నిద్ర లేకుండానే గడిపారు.

ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, వీకేపేట, దాసన్నపేట, దానంపేటలో భూమి కంపించినట్టు తహశీల్దారు బి. శ్రీహరిబాబు తెలిపారు. భూకంప తీవ్రత చాలా తక్కువ అని పేర్కొన్నారు. కవిటి మండలంలోనూ దాదాపు 10 గ్రామాల్లో భూ ప్రకంపనలు కనిపించినట్టు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. భయంతో రాత్రంతా జాగారం చేశామని చెప్పుకొచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/