పోలీసుల అదుపులో విశాఖ కేజీహెచ్ పసికందు అపహరణ నిందితులు
శిశువు తల్లిదండ్రులకు సమాచారం

Visakhapatnam: విశాఖ కేజీహెచ్ లో చిన్నారి ఆపహరణ కేసును పోలీసులు చేధించారు. . శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సమీపంలో ఈ కేసుకు సంబంధించిన నిందితులను గుర్తించిన పోలీసులు చిన్నారితో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శిశువు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
పోలీసుల కధనం ప్రకారం ..
విశాఖ కేజీహెచ్ నుంచి చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు కేజీహెచ్ నుంచి గురుద్వారాకు ఆటోలో, అక్కడి నుంచి కారులో శ్రీకాకుళం వైపు బయలుదేరినట్లు తెలిపారు.
బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. చిన్నారి కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు ? అనే విషయాలపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు.
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలోని రేవిడి రౌతులపాలెం గ్రామానికి చెందిన మజ్జి అప్పయ్యమ్మ కేజీహెచ్ లోని గైనిక్ వార్డులో ఈనెల 11వ తేదీన చేరింది. ఈనెల 13వ తేదీన ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది. సిజేరియన్ కావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం7 గంటల గంటల సమయంలో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు వార్డులోకి వెళ్లి పసికందును తీసుకుని పరారయ్యారు. ఆ సమయంలో పసికందు అమ్మమ్మ అక్కడే ఉంది. ఆస్పత్రి సిబ్బంది అనుకుని పసికందును ఆ మహిళలిద్దరికీ తాన ఇచ్చినట్టు ఆమె తెలిపింది.
పాపను తీసుకెళ్లి చాలా సేపు అవుతున్న , తీసుకుని రాకపోవడంతో పసికందు తల్లి కంగారు పడింది. పసికందు అపహరణకు గురైనట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అక్కడకు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ, పసికందును తీసుకొని వేగంగా నడుచుకుంటూ వార్డు లోపలినుండి బయటకు పారిపోయినట్టు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు ఆటో స్టాండ్ లో విచారించగా ఇద్దరు మహిళలు పసికందును తీసుకొని ఆటోలో గురుద్వారా చేరుకొని విజయ డయాగ్నస్టిక్ బస్టాప్ వద్ద దిగినట్టు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/