‘గ్రేటర్‌’ ఫలితాలతో మారుతున్న సమీకరణలు

‘హబుల్‌’ గతవారం రోజులపై టెలిస్కోప్‌

Changing equations with 'Greater‌' results
Changing equations with ‘Greater‌’ results

మొత్తంగా గ్రేటర్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలి తాలను పరిశీలిస్తే హంగ్‌దిశగానే మేయర్‌ పీఠంవెళ్లింది. కాగా,జిహెచ్‌ఎంసీలోఎక్స్‌అఫిషియో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మేయర్‌ ఎన్నిక నోటిఫికేషన్‌ వరకు ఎక్స్‌అఫిషియోల నమోదుకు అవకాశం ఉంది.

జిహెచ్‌ఎంసీలో ఓటున్న ఎంపి,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సభ్యత్వం వస్తుంది.ఎంపి కెఆర్‌ సురేష్‌ రెడ్డి,నూతనంగా నియామకమైన ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే ఎక్స్‌అఫిషియో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకు న్నారు.కొత్తమేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సమయంలో ఎక్స్‌అఫిషియో సభ్యుల నమోదుకు మళ్లీ అవకాశం ఇస్తారు.

ఇతర మున్సిపాలిటీలో ఓటు వేయకుండా, జిహెచ్‌ఎంసీ పరిధిలో ఓటు హక్కుకలిగిన ఎంపిలు,ఎమ్మెల్యేలు ఇక్కడనమోదు చేసుకుంటే వారు కూడా ఓటువేయడానికి అర్హులు అవుతారు.ఈ పరిస్థితుల్లో టిఆర్‌ఎస్‌ ఎలా వ్యూహం ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

గ్రేటర్‌లో 44సీట్లు గెలిచిన మజ్లీస్‌ టిఆర్‌ఎస్‌కుమద్దతు తెలిపితే టిఆర్‌ఎస్‌కు ఎక్స్‌ అఫిషియో సభ్యుల అవసరం ఉండదు.మేయర్‌ ఎన్నిక నాడు హాజరయ్యే సభ్యుల్లో మెజారిటీ ఉన్నపార్టీ అభ్యర్థిని మేయర్‌గా ఎన్నుకుంటారు. తర్వాత డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కూడాఅలాగే జరుగుతుంది.

టిఆర్‌ఎస్‌కు మజ్లీస్‌నేరుగామద్దతు ఇవ్వకుండా ఓటింగ్‌కు గైర్హాజరైతే మేయర్‌ పదవి టిఆర్‌ఎస్‌కు సులభంగా లభిస్తుంది. ఈ అంశం పైనా ఎంఐఎం చర్చిస్తోందనితెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలలో టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ భవిష్యత్తుఉన్న నేతగా ఎంఐఎంఅధినేతఅసదుద్దీన్‌ ఓవైసి అభివర్ణించారు.

ఇదిలా ఉంటే,బిజెపిమాత్రం మేయర్‌పీఠాన్ని టిఆర్‌ఎస్‌,ఎంఐఎం కలిసి దక్కిం చుకోవడమే కోరుకుంటుంది.వారి మధ్యబంధాన్ని రాజకీయంగా వినియోగించుకోవాలని వ్యూహరచ న చేసింది.మూడు నెలల్లో రాబోయే వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ,6 నెలల్లోగా జరుగబోయే నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఎమ్మె ల్యే ఉపఎన్నికల్లోనూ పట్టుసాధించేందుకు బిజెపి ఇప్పటినుంచే వ్యూహరచన ప్రారంభించింది.

ప్రజా స్వామ్యంలో ప్రతిపక్షంరాకుండా చూసుకోవడం అత్యధికసీట్లు గెలుచుకోవడం ఒక వ్యూహమైతే, ప్రతిపక్ష పార్టీనే లేకుండా చేస్తానడం సరికాదు. రా ష్ట్రంలో గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అందరి అంచాలన్నీ తారుమారు అయ్యాయి.

గ్రేటర్‌లో దాదాపుగా దుబ్బాక సీనే రిపీట్‌ అయింది. ప్రభుత్వ అనుకూలం,ప్రభుత్వ వ్యతిరేకం అనే పోటీ జరిగింది. అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు బిజెపి చెమటలు పుట్టించింది. టిఆర్‌ఎస్‌-బిజెపి నువ్వా నేనా అంటూ ఫలి తాల్లో దూసుకెళ్లాయి.

గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అతి పెద్ద పార్టీగా అవతరించినా మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించలేకపోయింది. బిజెపి 4నుంచి 48స్థానాలకు పుంజుకుని రాష్ట్రంలో ప్రగతిశీల పార్టీలకు సవాల్‌గా నిలిచింది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లో బిజెపినే ముందంజలో ఉంది. తర్వాత బ్యాలెట్‌ బాక్సులు ఓపెన్‌ చేశాక టిఆర్‌ఎస్‌ కాస్త పుంజుకుంది. అయినా కూడా అంతగా ప్రభావం చూపించలేదు.

150 కార్పొరేటర్‌ స్థానాల్లో మేజిక్‌ ఫిగర్‌ 76 స్థానాలు.ప్రస్తుతం 55 సీట్లకే టిఆర్‌ఎస్‌ పరిమితమైంది.ఇక బిజెపి కూడా అంతేస్థాయిలో దూసుకొచ్చిం ది. దాదాపు 48 సీట్లను కమలం కైవసం చేసుకుంది. గ్రేటర్‌ వాసులు ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో టిఆర్‌ ఎస్‌కు మేయర్‌పీఠం కష్టంగానే మారింది. గ్రేటర్‌లో ప్రస్తుతం 150మంది కార్పొరేటర్లతోపాటు 45ఎక్స్‌అఫిషియో ఓట్లున్నాయి.

మొత్తం 195ఓట్లు,అయితే టిఆర్‌ఎస్‌కు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నా మేయర్‌ పీఠం దక్కాలంటే 67 కార్పోరేటర్లు గెలవాల్సి ఉండింది.కానీ టిఆర్‌ఎస్‌కు 55 కార్పోరేటర్‌ సీట్లు మాత్రమే దక్కాయి.దీంతో ఎంఐఎంతో టిఆర్‌ఎస్‌ పొత్తు పెట్టు కోక తప్పని పరిస్థితి నెలకొంది. టిఆర్‌ఎస్‌కు 31 మంది ఎక్స్‌ అఫిసియో సభ్యులున్నారు.

ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిసి మేయర్‌ పీఠానికి మేజిక్‌ ఫిగర్‌ 98 కావాల్సి ఉంది. మేయర్‌ పీఠం కోసం టిఆర్‌ఎస్‌ ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి. మరో 12 ఓట్లను ఎలా సాధిస్తోంది? 106 స్థానాల్లో టిడిపి పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు.

పాతబస్తీలో మజ్లీస్‌ పార్టీ పట్టు నిలుపుకుంది. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో పొత్తుతో పోటీలో నిలిచిన మజ్లీస్‌ పార్టీ ఈసారి సింగిల్‌గానే పోటీ చేసింది.ఈసారి కూడా44చోట్ల సత్తాచాటింది. పాతబస్తీ లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది.

ఇక్కడ పాగా వేయాలన్న అధికార టిఆర్‌ఎస్‌, బిజెపి ప్రయత్నాలను అడ్డుకోగలిగింది.1959లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కు జరిగిన ఉప ఎన్నికలో ఇద్దరు కార్పొరేటర్లతో మొదలైన మజ్లీస్‌ ప్రస్థానం 2016 ఎన్నికల్లో 44కు చేరింది. గత ఎన్ని కల్లో మజ్లీస్‌-టిఆర్‌ఎస్‌,బిజెపి-టిడిపి కూటముల మధ్య పోరు నడిచింది.

ఈసారి మజ్లీస్‌,టిఆర్‌ఎస్‌,బిజెపి మధ్య త్రిముఖ పోరు సాగింది.మొత్తం 51 స్థానాల్లో మజ్లీస్‌ బరిలోనిలిచింది. గత ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ 99 డివిజన్లలో విజయం సాధించింది. దీంతో మేయర్‌ పీఠం టిఆర్‌ఎస్‌ వశమైంది. అప్పట్లో ఎక్స్‌ఆఫిషియో ఓట్లు అవసరం రాలేదు.

ఈసారి జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా సాగడం, అధి కార పార్టీ స్థానాలు తగ్గడంతో మజ్లీస్‌ కీలకం కానుంది. జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ టిఆర్‌ ఎస్‌కు ఇన్నాళ్లు మజ్లీస్‌ మిత్రపక్షంగా ఉంది. అదే మైత్రిని కొనసాగిస్తుందా? మేయర్‌ పీఠాన్ని టిఆర్‌ఎస్‌కు అంద జేస్తుందా లేదా? అనేది వేచి చూడాలి.

మేయర్‌ పీఠం ఎన్నికలు 2021 ఫిబ్రవరి 10 తర్వాతే ఉంటుంది. గ్రేటర్‌లోని ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఆ రోజుతో ముగిస్తుంది.ఫిబ్ర వరి 10 తర్వాతే కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాలు, ఆ తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు ఉంటాయి. 2స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ ఘోర పరాజయంలోకి వెళ్లింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలేతగు లుతున్నాయి. టిఆర్‌స్‌కు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌ నేతలు గొప్పగా చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనబడుతోంది.

ఒకప్పుడు గ్రేటర్‌ పీఠాన్ని ఏలిన కాంగ్రెస్‌ తాజాగా ఎన్నికల్లోనూ కేవలం రెండు స్థానాలకే పరి మితమైంది. 2009 జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 149 డివిజన్లలో పోటీ చేసిన కాంగ్రెస్‌ 53 సీట్లు గెలిచి ఎంఐఎం మద్దతుతో మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంది.

2016 జరిగిన జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే (పటాన్‌చెరు, నాచారం) పరిమితమైం ది. ఈసారి ఏ పార్టీతో పొత్తు లేకుండా కదన రంగంలోకి దూకిన కాంగ్రెస్‌ మొత్తం 146 చోట్ల అభ్యర్థుల ను దింపి మళ్లీ రెండు (ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌) స్థానాలకే గెలుచుకోగలిగింది. బిజెపి స్పీడ్‌ అనూహ్యరీతిలో సాగింది. గత ఎన్నికల్లో 4 సీట్లు ఉండగా, ఇప్పుడు ఏకంగా 48కి వెళ్లింది. గ్రేటర్‌ ఎన్నికల్లో ఉనికిని చాటుతూ రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది.

బిజెపి ఇంతస్థాయిలో సీట్లు, ఓట్లు సాధించ డంతో రాష్ట్రం మొత్తంగా రాజకీయాలపై ప్రభావం చూపింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ ఎన్నికల్లో నేరెడ్‌మెట్‌ డివిజన్‌ మినహా మిగతా 149 డివిజన్లలో లెక్కింపు పూర్తయింది. ఈసారి ఫలితాల్లో కారు జోరు తగ్గింది. జిహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ 55 స్థానాల్లో విజయం సాధించింది.

మరోవైపు టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దిగిన బిజెపి అనూహ్యంగా 48 స్థానాల్లో విజయం సాధించింది. ఎప్పటిలాగే పాతబస్తీ ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ తన పట్టును నిలుపుకొని పోటీ చేసిన 51 స్థానాలకుగాను 44 డివిజన్లను కైవసం చేసుకుంది.

గత జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. నేరెడ్‌ మెట్‌లో స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువ ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిం దిగా హైకోర్టు ఆదేశించింది.

పోటాపోటీగా ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మేయర్‌ ఎంపికలో ఎక్స్‌ అఫిషియో సభ్యులు కీలకపాత్ర పోషించనున్నారు. జిహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం కార్పొరేషన్‌ పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ, శాసనమండలి సభ్యులతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకున్న రాజ్యసభ, ఇతర ఎమ్మెల్సీలు కూడా ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉంటారు.

జిహెచ్‌ఎంసీలో ప్రస్తుతం45 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు. ఇందులో టిఆర్‌ఎస్‌కు 31 మంది, ఎంఐ ఎం 10, బిజెపికి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒకరు ఎక్స్‌అఫిషియో(ఎంపీ రేవంత్‌రెడ్డి) సభ్యులు ఉన్నారు.

ప్రస్తుత జాబితా ప్రకారం 150 మంది కార్పొరేటర్లు,45 మంది ఎక్స్‌అఫిషియో సభ్యుల సంఖ్య కలిపితే మొత్తం సభ్యులలో సగానికి పైగా బలంగల పార్టీయే జిహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ గెలిచే వీలుంటుంది.

టిఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 31మంది ఎక్స్‌అఫి షియో సభ్యుల బలంఉండగా, ఇంకా 67స్థానాలు పొందాల్సి ఉండింది. కానీ 55 స్థానాలకు పరిమి తమైంది. దీంతో ఆ పార్టీ సొంతంగా మేయర్‌ పీఠం దక్కుంచుకునే పరిస్థితి లేదు. ఎంఐఎం(మజ్లీస్‌) పార్టీకి 10 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులుండగా, ఇంకా 88 డివిజన్లలో గెలవాల్సి ఉండింది. కానీ 44 స్థానాలకే పరిమితమైంది.

దీంతో ఆ పార్టీ కూడా సొంతంగా మేయర్‌ పీఠందక్కించుకునే పరిస్థితిలేదు. బిజెపికు ప్రస్తుతం ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. ఇంకా 95 కార్పొరేటర్‌ స్థానాలు దక్కితేనే ఆ పార్టీకి మేయర్‌ పీఠం దక్కుతుంది.

కానీ బిజెపికి 48 కార్పొరేటర్‌ సీట్లు దక్కాయి. గతం కంటే బిజెపి బాగా పుంజుకున్నప్పటికీ ఆ పార్టీకి నేరుగా మేయర్‌ పీఠం దక్కించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ఉన్నప్పటికీ ఆయన బోడుప్పల్‌ మున్సిపాలిటీలో ఓటు వేసినందున ఇక్కడ అవకాశం ఉండదు.

  • వై.నాగేశ్వరరావు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/