ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతారు – వైస్సార్సీపీ మంత్రి కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫై ప్రసంశలు కురిపించారు ఏపీ వైస్సార్సీపీ మంత్రి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ని ఏపీ రవాణాశాఖ మంత్రి విశ్వరూప్‌ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వయంభు నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా పునర్మించారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఆరోగ్యం క్షీణించడంతో స్వామివారికి మొక్కి ముంబయికి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం కుదుటపడడంతో స్వామివారిని దర్శించుకునేందుకు గుట్టకు వచ్చినట్లు చెప్పారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మరో మూడు నెలల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా రానున్నట్లు తెలిపారు.