ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయిః ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ

అధికార పార్టీ ఓట్ల అక్రమాలకు పాల్పడుతోందన్న చంద్రబాబు

chandrababu

అమరావతిః ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ టిడిపి నేతలు ఎలుగెత్తుతున్నారు. తాజాగా, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం జరగడం లేదని తెలిపారు. మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు, ఫోటోగ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాల్సి ఉంటుందని, కానీ, ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

“ఇంటింటి సర్వేలో బాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, రాష్ట్ర డేటా బేస్‌లోని బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ సమాచారం మేరకు ఈఆర్ఓలు మరణించిన వారి ఓట్లు తొలగించాలి. కానీ, దురదృష్టవశాత్తు డ్రాప్ట్ ఓటర్ లిస్టులో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు దర్శనమిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్–1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి. కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

అర్హత లేని వారికి సైతం ఫామ్–6 ద్వారా ఆన్‌లైన్ లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. వీటిపై మా అభ్యంతరాలపై నేటికి దృష్టిపెట్టలేదు. డైరెక్ట్‌ గా గానీ, ఆన్‌లైన్‌లో గానీ బల్క్ ఫామ్-7 ధరఖాస్తులను స్వీకరించరాదు.

ఓటుపై అభ్యంతరం లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు కచ్చితంగా ఆధారాలు చూపించాలి. కొన్ని నియోజకవర్గాలలో ఎటువంటి విచారణ చేయకుండా తెల్ల పేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారు. నేటికీ ఈఆర్ఓలు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఓట్ల మార్పులు చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సందర్బంగా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రకటించి నెల గడుస్తున్నా పైన పేర్కొన అనేక అభ్యంతరాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫైనల్ లిస్టులో ఓట్ల అవకతవకలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి సంబంధించి ఈఆర్ఓలకు, డీఈఓలకు నిర్ణీత సమయం కల్లా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయాలని కోరుతున్నాం” అంటూ చంద్రబాబు ఎస్ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.