థాంక్యూ అన్నా అంటూ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు , అభిమానులు , నియోజకవర్గ ప్రజలే కాదు ఇతర పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా సీతక్క పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. “ములుగు ఎమ్మెల్యే, నా సోదరి ఎమ్మెల్యే సీతక్కకు పుట్టినరోజు శుభకాంక్షలు. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

చంద్రబాబు ట్వీట్ పట్ల సీతక్క స్పందించారు. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ ఆత్మీయంగా బదులిచ్చారు. కాగా, సీతక్క ఈసారి అమెరికాలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆమె అభిమానుల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు.

అలాగే నిర్మాత బండ్ల గణేష్ సైతం సీతక్కకు విషెష్ అందించారు. అంతే కాదు సీతక్క జీవిత చరిత్ర ఫై ఓ సినిమా చేస్తానని తెలిపారు. నమ్ముకున్న ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి ఓ అభిమాని అడవిలో అన్న, లీడర్ సినిమాలు కలిపితే నిజజీవితంలో సీతక్క సినిమా అవుతుందని.. మీరు తీయాలన్నా అంటూ కామెంట్ చేశారు.

దీంతో స్పందించిన బండ్ల గణేష్.. అద్భుతమైన సలహా.. తప్పకుండా ఆలోచిస్తానని కామెంట్ చేశారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళ నక్సలైట్ గా, దళం లీడర్ గా పనిచేసిన సీతక్క వివిధ హోదాలలో దాదాపు రెండు దశాబ్దాల విప్లమోద్యమ జీవితం గడిపారు. అజ్ఞాత జీవితానికి గుడ్ బై చెప్పి జనజీవన స్రవంతిలోకి వచ్చాక ఆమె ఎల్ఎల్బి చదివి సామాజిక సేవలో చెరుకుగా పాల్గొని కొంతకాలం తర్వాత టీడీపీ పార్టీ తరఫున 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా టిడిపి తరఫునుండి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.