ఋషికొండ బీచ్ ఎంట్రీ ఫీజు లేదు..ప్రభుత్వం క్లారిటీ

రుషికొండ బీచ్ ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. బీచ్ ఎంట్రీకి రూ.20 చెల్లించాలని వస్తున్న వార్తల్లో నిజం లేదని, బీచ్ లో ప్రవేశానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు. రుషికొండ బీచ్ కు బ్లూ స్టార్ హోదా లభించిందని తెలిపారు.

బ్లూ స్టార్ హోదా లభించిన బీచ్ లకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం, ఆ బీచ్ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుసుము వసూలు చేయాలని కేంద్రం పేర్కొందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. దీనిని ఆధారంగా చేసుకుని బీచ్ లో రుసుము వసూలు చేయడానికి రంగం సిద్ధమవుతున్న సమయంలో మంత్రి అమర్నాథ్ స్పందించారు. రుషికొండ బీచ్ లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని, బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అయితే బీచ్ లో ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని అమర్నాథ్ స్పష్టం చేశారు.

విశాఖ పర్యటక ప్రదేశాల్లో రుషికొండ బీచ్ ఒకటి. ఈ బీచ్ కు పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇన్నాళ్లు రుషికొండ బీచ్ సందర్శనకు ఎలాంటి రుసుము లేదు. జులై 11 నుంచి బీచ్ లో అడుగుపెట్టాలంటే టికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేని వార్తలు వచ్చాయి. ఒక వ్యక్తికి టికెట్ ధరను రూ.20 నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖలో ఇప్పటి వరకూ ఏ బీచ్ లో టికెట్లు అమల్లో లేవు కానీ కొత్తగా రుషికొండ బీచ్ లో టికెట్లు అమల్లోకి తీసుకురావడంపై విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఎంట్రీ ఫీజు ఫై క్లారిటీ ఇచ్చింది.