ఉజ్జయిని అమ్మవారికి సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేకంగా మొక్కుకున్నాను – మంత్రి మల్లారెడ్డి

నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల సందర్బంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నానని, ఇప్పటివరకు తాను అమ్మవారిని కోరిన కోరికలన్నీ తీరాయని అన్నారు. ఈ ఏడాది సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేకంగా మొక్కుకున్నానని, ఆ కోరిక కూడా తీరుతుందని నమ్ముతున్నానని తెలిపారు.

అంతేకాదు తానూ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఏం కోరుకున్నదీ అనేది కూడా బయటకు తెలిపారు మల్లారెడ్డి. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయని, అది నెరవేరాలంటే కేసీఆర్, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విజయవంతం అవ్వాల్సిన అవసరం ఉందని, తాను అమ్మవారిని కోరుకుంది ఇదేనని స్పష్టం చేశారు.

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం తెలంగాణ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమర్పించగా, మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పద్మారావు కుటుంబసభ్యులతో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత కూడా సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.