నేడు సుప్రీం కోర్ట్ లో చంద్రబాబు కేసు విచారణ..బెయిల్ వస్తుందా..?

స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబదించిన విచారణ గత కొద్దీ రోజులుగా సుప్రీం కోర్ట్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. సెక్షన్ 17ఏ ప్రకారం తన మీద ఉన్న కేసును కొట్టేయాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.

గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తికానందున నేటి మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ తన వాదనలను కొనసాగిస్తారు. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి విన్నవించారు. ముకుల్‌రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్‌ వాదనలు ప్రారంభించనున్నారు. ఈరోజు సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. అవి ముగిసిన తర్వాత ధర్మాసన్ ఈరోజే తీర్పు చెబుతుందా..లేక తీర్పును రిజర్వ్ చేస్తుందా అన్నది చూడాలి.