హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.భాస్కర్ మృతి

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.భాస్కర్ రావు (94) సోమవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ..సోమవారం ఆరోగ్యం మరింత విషమం కావడంతో తుది శ్వాస విడిచారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన భాస్కర్ రావు ప్రస్తుతం ఉప్పల్ తూర్పు కళ్యాణపురిలో నివాసం ఉంటున్నారు. భాస్కర్ కు భార్య లలితాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తర్వాత 1963లో న్యాయవాద వృత్తిని చేపట్టి.. దేవరకొండ, నల్గొండలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు.

1981లో జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసి.. జిల్లా జడ్జిగా, జాయింట్ హైకోర్టు రిజిస్ట్రార్‌గా రాజమండ్రి, శ్రీకాకుళం, సికింద్రాబాద్‌లలో పనిచేశారు. 1995లో అడిషనల్ జడ్జిగా, 1997లో పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు. 1999లో హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం కమిటీ ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈరోజు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో భాస్కర్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి.