జగన్ గిరిజనుల సహజ సంపదను కూడా దోచుకుంటున్నారుః చంద్రబాబు

జీవో నెం.3 రద్దు చేయడం సామాజిక న్యాయమా అంటూ ఆగ్రహం

chandrababu-raa-kadali-ra-meeting-at-araku

అరకు ః అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో రా కదలి రా సభకు టిడిపి అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. సామాజిక న్యాయం చేస్తానని ఈ ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు… జీవో నెం.3 రద్దు చేయడం సామాజిక న్యాయమా? అని చంద్రబాబు నిలదీశారు.

గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే లభించాలని భావించామని, తాను గతంలో ఇచ్చిన జీవో నెం.3ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి రాగానే జీవో నెం.3ని పునరుద్ధరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్ కు ఇష్టంలేదని, ఈ కారణంతోనే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారని విమర్శించారు. ప్రపంచంలో ఏ మూలన చదువుకుంటున్నా గిరిజనులకు ఉపకారవేతనం లభించేదని, కానీ దాన్ని రద్దు చేశారని అన్నారు. జగన్ గిరిజనుల సహజ సంపదను కూడా దోచుకుంటున్నాడని ఆరోపించారు.

తాము అరకులో కాఫీని ప్రమోట్ చేస్తే, జగన్ గంజాయిని ప్రమోట్ చేశాడని మండిపడ్డారు. మాట్లాడితే నా ఎస్టీలు అంటాడు… కానీ గిరిజనులకు చెందిన 16 పథకాలు రద్దు చేశాడు… దీన్ని ఏవిధంగా సామాజిక న్యాయం అంటారో జగనే చెప్పాలని మండిపడ్డారు.

“ఈ ఐదేళ్లలో ఒక్కటైనా మంచి పనిచేశాడా? అందరికీ నొక్కినట్టు బటన్ నొక్కుతానని చెబుతాడు తప్ప, గిరిజనులకు ఏ బటనూ నొక్కలేదు. మాటలు మాత్రం కోటలు దాటతాయి కానీ, చేతలు మాత్రం గడప కూడా దాటవు” అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.