ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు..సిసోడియా, ఇతరుల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

మొత్తం 52.24 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌ చేసినట్లు వెల్లడి

ed-attaches-assets-worth-rs-52crore-of-manish-sisodia-others-in-delhi-excise-policy-case

న్యూఢిల్లీః దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుల అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా, ఆయన భార్య, మరికొందరు నిందితులకు చెందిన రూ.52 కోట్లకు పైగా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మనీష్ సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియాకు చెందిన రెండు ఆస్తులు, మరో నిందితుడు రాజేష్ జోషి (క్యారియట్ ప్రొడక్షన్స్ డైరెక్టర్ డైరెక్టర్), గౌతమ్ మల్హోత్రాకు చెందిన ఇతర స్థిరాస్తులను అటాచ్ చేయాలని తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసింది.

ఈ అటాచ్‌మెంట్‌లో రూ. 11.49 లక్షల విలువైన మనీష్ సిసోడియా బ్యాంక్ బ్యాలెన్స్‌లు, బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 16.45 కోట్లు) సహా రూ. 44.29 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయి. మొత్తం అటాచ్‌మెంట్ విలువ రూ.52.24 కోట్లు అని ఈడీ తెలిపింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను మార్చిలో ఈడీ అరెస్ట్ చేసి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోరుతూ గత గురువారం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేసేందుకు 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని రూపొందించిందని ఈడీ, సీబీఐ ఆరోపించాయి. దీనిని ఆప్ పార్టీ తీవ్రంగా ఖండించింది.