చంద్రబాబు బెయిల్ రద్దు..సుప్రీంకోర్టులో మళ్లీ విచారణ వాయిదా

Chandrababu bail cancelled..Supreme court adjourned again

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అందుబాటులో లేరని, అందుకే విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు న్యాయవాదుల బృందం తరఫున సిద్ధార్థ్ లూథ్రా సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తమకు 3 వారాల సమయం ఇవ్వాలని విన్నవించారు.

అందుకు ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ… గతంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఇలాగే సమయం తీసుకున్నారని, ఇప్పుడు కూడా మళ్లీ వాయిదా కోరుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తరఫున ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసినందున, వీలైనంత త్వరలో తదుపరి విచారణ చేపట్టేలా తేదీని నిర్ణయించాలని రంజిత్ కుమార్ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. తొలుత తదుపరి విచారణను రెండు వారాల తర్వాత లిస్ట్ చేయాలని పేర్కొన్నప్పటికీ, ఏపీ సీఐడీ న్యాయవాది విజ్ఞప్తితో తేదీని ప్రకటించింది.