మాజీ హోం మంత్రి సుచరిత డ్రైవర్ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. గుంటూరులోని బ్రాడీపేట 4వ లైన్‌లో ఉంటున్న చెన్నకేశవరావు .. తన గదిలో సోమవారం రాత్రి సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సుచరిత నివాసానికి కొద్దిదూరంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, కారు డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు.

డ్రైవర్‌ చెన్నకేశవరావు విధులు ముగించుకుని రూమ్‌కు రాగా.. అనంతరం పీఎస్‌వో రామయ్య వచ్చారు. రామయ్య తన పిస్టల్‌ను తీసి దిండు కింద పెట్టి స్నానం చేసేందుకు వెళ్లాడు. ఇంతలో ఆ పిస్టల్‌ తీసుకుని చెన్నకేశవురావు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే బలవన్మరణానికి కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చెన్నకేశవరావు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.