ఏపికి రావాలంటే అనుమతి ఉండాల్సిందే..డీజీపి

స్పందన పోర్టల్ ద్వారా పాస్ ఉండాల్సిందేనని వెల్లడి

goutham sawang
goutham sawang

అమరావతి: తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే సమాచారంతో ఏపికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మళ్లీ సొంత రాష్ట్రలకు పయనమయ్యారు. దీంతో పలువురు అనుమతి లేకుండానే స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే తెలంగాణ నుండి ఏపికి వస్తున్న వారంతా నిబంధనలు పాటించాల్సిందే అని ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపికి వచ్చే వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని డీజీపీ కోరారు. ఏపికి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతాయని, సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపికి వచ్చే వారు స్పందన పోర్టల్ ద్వారా అనుమతి తీసుకుని పాస్ పొందిన తరువాతనే రావాలని సూచించారు. పాస్ లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ అనుమతించబోమని స్పష్టం చేసిన ఆయన, రాత్రి పూట అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/